సభ్యత్వ నిబంధన


దేవుని మహా కృపను బట్టి పశ్చాత్తాపముతో ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొంది క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ సభ్యులముగా మేము దృఢ నిశ్చయముతో మరియు సంతోషముగా ఈ నిబంధనను నెరవేరుస్తామని వాగ్దానము చేస్తున్నాము.

1. దేవుని అధికారం

బైబిల్ మరియు యేసుక్రీస్తు సువార్తలో వెల్లడి చేయబడినట్లుగా, త్రియేక దేవుని యొక్క అత్యున్నత అధికారం క్రింద మేము కలిసి జీవిస్తాము.

2. ఆరాధన మరియు ప్రార్థన

ప్రభువును ఆరాధించడానికి మరియు ఆయన వాక్యాన్ని వినడానికి, అలాగే ఇతర సమయాల్లో ప్రార్థన, అధ్యయనం మరియు పరస్పర ప్రోత్సాహం కోసం మేము మానక క్రమంగా కలుసుకుంటాము (హెబ్రీ 10:25; కొలొ 4:2; యాకోబు 5:13–14).

3. సువార్త పరిచర్య

ఈ సంఘములో విశ్వాస సహితమైన సువార్త పరిచర్యను ప్రోత్సహించడానికి, దాని సిద్ధాంతాలు, సంస్కరణలు, పాలన మరియు మిషన్‌ను కొనసాగించడానికి మేము పరిశుద్ధాత్మ శక్తిని అనుసరించి పని చేస్తాము (కొలొ 3:16; గలతి 1:8–9; 2 తిమోతి 4:2; మత్తయి 28:18–20).

4. పెద్దల గౌరవం

మాకు కాపరులుగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు నియమించిన పెద్దలను మేము గౌరవిస్తాము. మా ఆత్మలకు లెక్క అప్పగించు వారు దుఃఖపడకుండా సంతోషంతో తమ పని జరుగునట్లు వారికి లోబడి, విధేయులుగా ఉంటాము (1 తిమోతి 5:17–19; హెబ్రీ 13:7, 17).

5. సహాయం మరియు వనరులు

ఈ సంఘము యొక్క పనికి, మనలోని పేదల సహాయం కొరకు మరియు దేశాలకు సువార్త వ్యాప్తి కొరకై మా సామర్థ్యమును, ఆత్మీయ వరములను మరియు వనరులను మేము సంతోషంగా అందిస్తాము (2 కొరింథీ 9:7–8; గలతి 6:10).

6. సహోదర ప్రేమ

ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించడం, ఒకరి భారాలను మరొకరు మోయడం మరియు ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం ద్వారా మేము సహోదర ప్రేమతో కలిసి నడుస్తాము (1 పేతురు 3:8; రోమా 12:10, 15; గలతి 6:2). సమాధానము మరియు క్షమాగుణమును కలిగి, గొడవలు మరియు విభజనలను నిరోధించడం మరియు ప్రేమపూర్వక క్రమశిక్షణను స్వాగతించడం ద్వారా మేము ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవడానికి కృషి చేస్తాము (ఎఫెసి 4:3; కొలో 3:13; గలతి 6:1; మత్తయి 18:15–20; 1 కొరింథీ 5:1–11; హెబ్రీ 3:12–13; 12:15–16).

7. పరిశుద్ధత మరియు దైవభక్తి

పరిశుద్ధత మరియు దైవభక్తిలో పరిపూర్ణత కొరకు, పాపం మరియు లోకనుసారమైన కోరికలను ఎదిరిస్తూ, ఒకరినొకరు బోధించుకుంటూ, ఉపదేశించుకుంటూ కలిసి ముందుకు సాగుతాము. మరియు పరిశుద్ధాత్మ శక్తి మరియు దేవుని వాక్యము ద్వారా క్రీస్తు స్వారూప్యములోనికి ఎదుగుతాము (కొలొ 3:5, 16; తీతుకు 2:12; 1 పేతురు 1:13–16).

8. వివాహం మరియు పిల్లల పెంపకం

మేము వివాహాన్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ మధ్యగల పవిత్రమైన నిబంధనగా గౌరవిస్తాము మరియు పిల్లలను ప్రభువు యొక్క పోషణ మరియు శిక్షణలో మా సంరక్షణలో వారిని పెంచుతాము (ఎఫెసీ 5:22–6:4; హెబ్రీ 13:4).

9. సువార్త రాయబారులు

దేవుని మహిమ కొరకు సువార్త రాయబారులుగా జీవిస్తూ, క్రీస్తు కొరకు ఇతరులను చేరుకోవడానికి మేము ప్రయత్నిస్తాము (కొలొ 4:5-6; 1 పేతురు 2:9).

10. సంఘం మార్పులు

మేము ఎప్పుడైనా ఈ సంఘమును వదిలి వెళ్లునప్పుడు, మరొక వాక్యానుసార బాధ్యతలను నెరవేర్చగల మరియు సువార్తను ప్రకటించే సంఘమును వెదుకుతాము. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ మరియు పరిశుద్ధాత్మ సహవాసం ఈ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మనకు సహాయం చేయును గాక! ఆమేన్.